Telangana Government Officially Cancelled the DSC Exam Process and also model school teachers posts for Recruiting Government Teacher in the State and Issued GO 19, Where TSPSC will take over the Teachers Recruitment Process from now.
హైదరాబాద్: ఉపాధ్యాయుల భర్తీలో జిల్లాస్థాయి నియామకాల వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్తర్వులతో డీఎస్సీ ద్వారా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలు ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపడతారు. డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారు.
ఈ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీని సైతం టీఎస్పీఎస్సీ ద్వారానే చేపట్టనున్నారు. డీఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో కొంత ఏకరూపత, అసంబద్ధత నెలకొంటోందని, జిల్లాస్థాయి నియామకాల ద్వారా గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన ప్రభుత్వం పోటీ పరీక్ష నిర్వహణ, ప్రతిభ జాబితా తయారీ, ఉపాధ్యాయ ఎంపిక బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన 10వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి.